భారతదేశంలో కశ్మీర్ నుంచి పాదపీఠంగా ఉన్న దేశం శ్రీలంక వరకు 18 శక్తిపీఠాలు ప్రసిద్ధి చెందాయి. శతాబ్దాలుగా పూజలు అందుకుంటున్న ఈ క్షేత్రాల్లోని అమ్మవారి మూర్తులు భక్తులను అనుగ్రహిస్తున్నాయి. వీటి ఆవిర్భావం వెనక పౌరాణిక కథ ఒకటి ప్రచారంలో ఉంది.
ఒకానొకప్పుడు పరమశివుడి భార్య సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి వెళ్తుంది. అక్కడ తండ్రి తన భర్తను అవమానించడంతో సహించలేకపోతుంది. యజ్ఞగుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఇది శివుడికి ఆగ్రహం తెప్పిస్తుంది. ఆ కోపంలో వీరభద్రుణ్ని సృష్టించి దక్ష ప్రజాపతిని సంహరిస్తాడు. ఆ తర్వాత అతనికి పునర్జన్మ ప్రసాదిస్తాడు. కానీ, పరమశివుడు భార్యా వియోగాన్ని తట్టుకోలేకపోతాడు.
సతీదేవి పార్థివ దేహాన్ని భుజాన వేసుకుని ఏడుస్తూ తిరుగుతూ ఉంటాడు. శివుడి దుఃఖం విశ్వాన్ని నాశనం చేస్తుందని మునులంతా భయపడతారు. వారందరూ విష్ణువు దగ్గరికి వెళ్లి శివుణ్ని శాంతింపజేయమని ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తాడు. భార్య శరీరం కనిపించకపోతే పరమేశ్వరుడు మామూలు వాడైపోతాడని మునుల ఆశ. అలా భారతదేశంలో వివిధ ప్రదేశాల్లో పడిపోయిన సతీదేవి శరీర భాగాలే శక్తిపీఠాలుగా అవతరించాయని పురాణ గాథ.
వీటిని 51 మొదలుకుని 64 పీఠాలుగా పేర్కొంటారు. వీటిలో 18 మరీ ప్రధానమైనవి. అమ్మవారి నాలుక పడిన భాగంలో వెలసిన క్షేత్రం హిమాచల్‌ప్రదేశ్‌లోని జ్వాలాముఖి ఆలయం, పైదవడ పడిన ప్రదేశం తెలంగాణలోని అలంపురంలో జోగులాంబగా, మెడ భాగం పడిన శ్రీశైలంలో శ్రీమాత భ్రమరాంబగా, వీపు భాగం పడిన పిఠాపురంలో పురుహూతికా దేవిగా పూజలు అందుకుంటున్నది. కాశీలో అమ్మ ముక్కు భాగం పడిందట.
పై పెదవి ఉజ్జయినిలో మహాకాళిగా కొలుపులు అందుకుంటున్నది. రొమ్ము భాగం గయలో మంగళగౌరి, గర్భభాగం అస్సాం రాజధాని గువాహటీలో కామాఖ్య, కుడిచేయి పడిన ప్రదేశం కాశ్మీర్‌లో శారదా క్షేత్రంగా, ఎడమ చేయి పడిపోయిన ప్రాంతం మహారాష్ట్ర మాహుర్‌లో రేణుకా ఏకవీర క్షేత్రాలుగా ప్రసిద్ధిచెందాయి. నాభి భాగం పడిన ప్రదేశంలో ఒడిశా రాష్ట్రం జాజ్‌నగర్‌లో బిరజా దేవిగా పూజిస్తున్నారు.
కన్ను భాగం పడిన కొల్హాపూర్‌లో (మహారాష్ట్ర) అమ్మ మహాలక్ష్మిగా సిరిసంపదలు కురిపిస్తున్నది. కేశాలు పడిపోయిన చోట కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లో చాముండేశ్వరి శక్తిపీఠం వెలసింది. పొట్ట భాగం పడినచోటు బెంగాల్ రాష్ట్రం పాండువా. ప్రద్యుమ్న క్షేత్రంగా పిలిచే ఇక్కడ జగజ్జనని శృంఖలాదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నది. చేతివేళ్లు పడిన త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగలో మాధవేశ్వరిగా, గజ్జ భాగం పడిన శ్రీలంకలో శాంకరీదేవిగా అమ్మ వరప్రదాయినిగా అలరిస్తున్నది. ఎడమ చెంప బుగ్గ పడిన భాగం ద్రాక్షారామం భీమేశ్వర క్షేత్రంలో మాణిక్యాంబగా పేరుగాంచింది. వెన్ను భాగం కంచిలో కామాక్షిదేవిగా కటాక్షిస్తున్నది.